భయం లేని ఆటతీరే మమ్మల్ని ఫైనల్‌కు చేర్చింది: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్

  • సానుకూల దృక్పథంతోనే బరిలోకి దిగామన్న పటీదార్
  • గుజరాత్ బౌలింగ్ లైనప్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలనుకున్నామని వెల్లడి
  • ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తమ బ్యాటర్లు సిద్ధమయ్యారన్న కెప్టెన్
  • పెద్ద వేదికపై గెలిచేందుకు అటాకింగ్ మైండ్‌సెట్ అవసరమని వ్యాఖ్య
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌పై సాధించిన 92 పరుగుల భారీ విజయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన తమ జట్టులో ఉన్న దూకుడైన ఆలోచనా విధానం, భయం లేని ఆటతీరే వరుసగా రెండోసారి ఫైనల్ చేరడానికి కారణమని అన్నాడు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 254/5 పరుగుల రికార్డు స్కోరు సాధించగా, అనంతరం గుజరాత్‌ను 162 పరుగులకే కట్టడి చేసింది.

మ్యాచ్ అనంతరం పాటిదార్ మాట్లాడుతూ.. తాము మ్యాచ్‌లోకి అడుగుపెట్టినప్పుడే సానుకూల దృక్పథంతో ఉన్నామని, గుజరాత్ బౌలింగ్ లైనప్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. "ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్. ముఖ్యంగా మా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రతి ఒక్కరూ ఒకే ప్లాన్‌తో కాకుండా, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా క్రీజులోకి వచ్చారు. మేము మీపై విరుచుకుపడతాం అనే సంకేతాన్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా బౌలర్లకు చూపించాం. ఆ దూకుడు ప్రతి బ్యాటర్‌లోనూ కనిపించింది" అని పాటిదార్ పేర్కొన్నాడు. క్వాలిఫైయర్-1 లాంటి పెద్ద వేదికపై గెలిచేందుకు అటాకింగ్ మైండ్‌సెట్ అవసరమని మ్యాచ్‌కు ముందే టీమ్ మీటింగ్‌లో చర్చించుకున్నట్లు ఆయన వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ వేగంగా పరుగులు రాబట్టగా, మిడిల్ ఓవర్లలో రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం 39 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన తన బ్యాటింగ్ శైలి గురించి పటీదార్ వివరిస్తూ.. తాను సాధారణంగా మొదట 8-10 బంతులు ఆడి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేస్తానని, ఆ తర్వాతే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతానని చెప్పాడు. వికెట్ ఎలా ఉన్నా బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టడమే తనకు ఇష్టమని స్పష్టం చేశాడు.

ఇక భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్‌సీబీ బౌలర్లు ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారని కెప్టెన్ కొనియాడాడు. పిచ్‌పై మంచి బౌన్స్ ఉన్నందున సిక్సర్లు కొట్టడం అంత సులువు కాదని, అందుకే బౌలర్లు స్టంప్స్ లైన్‌లో బౌలింగ్ చేసి ఫలితం సాధించారని చెప్పాడు. గుజరాత్ టాప్ ఆర్డర్‌లో ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్‌లను పవర్‌ప్లేలోనే అవుట్ చేయాలనేది తమ ప్రధాన వ్యూహమని, అది సరిగ్గా వర్కవుట్ కావడంతోనే గుజరాత్ కోలుకోలేకపోయిందని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతామని చెప్పుకొచ్చాడు.

Rajat Patidar
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Gujarat Titans
Cricket
T20
Indian Premier League
Virat Kohli
Krunal Pandya

More Telugu News